21 September 2011

ఆధునిక సాహిత్యానికి.. అడుగు జాడ... మన గురజాడ 150వ జన్మదినోత్సవం

గురజాడ అప్పారావు
ఆధునికాంధ్ర సాహిత్యానికి దిశా నిర్దేశం చేస్తూ దీపధారియై ముందు నడుస్తూ  అడుగు జాడ గురజాడది అనిపించుకున్న గురజాడ సాహితీపరులందరికీ చిరస్మరణీయుడు.
 

దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్...

వట్టిమాటలు కట్టి పెట్టోయ్...  గట్టిమేల్ తలపెట్టవోయ్....
అంటూ దేశ ప్రజను జాతీయ దృక్పదంతో ఉద్బోధిస్తూ  రాసినగేయం ఏదేశప్రజలైనా పాడుకోదగ్గది. 
ఇలాంటి దేశభక్తి గేయం మరో బాషలో ఉండదనుకున్న అతిశయోక్తి కాదనిపిస్తుంది.

ఆయన సమాజంలోఉన్న మూఢవిశ్వాసాల్ని డంబాచారాల్ని తోకచుక్క అనే గేయంలో  కడిగివేశారు.  ఆధునిక మహిళ భారతదేశ చరిత్రను పునర్లిఖిస్తుంది అన్నారు. 
 
 

గురజాడ అప్పారావు కుటుంబం వారి తాతల కాలంలో కృష్ణా జిల్లా గురజాడ గ్రామం నుండి విశాఖ మండలానికి వలస వచ్చింది.  విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి తాలూకా రాయవరం గ్రామంలో 1862 సెప్టెంబర్  21 అప్పారావు జన్మించాడు.  తండ్రి వెంకట రామదాసు, తల్లి కౌసల్యమ్మ. చీపురుపల్లిలో పదేళ్ళ వరకు చదివాడు..
 
అతడు తన హైస్కూలు చదువుల రోజులలోనే శ్లోకాలు వ్రాసేవాడట. కాలేజీ లో అడుగు పెట్టిన కొత్తల్లోనే (21వ ఏట) సారంగధర అన్న ఇంగ్లీషు పద్యకావ్యాన్ని ప్రచురించిన ధీశాలి.  అప్పట్లోనే చంద్రహాస అన్న మరో ఇంగ్లీషు కావ్యాన్నికూడా వ్రాసేడు.  సారంగధర కావ్యం ఎంత పేరుపొందిందంటే ఆ ప్రచురిత కావ్యాన్ని  ప్రముఖ కలకత్తా పత్రిక తిరిగి తమ పత్రికలో ప్రచురించేటంత. అయితే వీటినీ, ఆతరువాత కొన్ని సంస్కృత నాటకాలకి ఆంగ్లంలో వ్రాసిన పీఠికలనుగానీ ఆ కవిశేఖరుని ఆంగ్ల భాషా వైదుష్యానికి  మచ్చుతునకలనవచ్చునేమో గానీ ఆయనకి చిరకీర్తిని తెచ్చి పెట్టినది మాత్రం తెలుగు లో మాగ్నమ్ ఆపస్ ( Magnum opus ) అనదగ్గ  కన్యాశుల్క నాటక రచన మాత్రమే..

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకాన్ని సుమారు 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించాడు .  ఆ రోజుల్లో ప్రబలంగా వున్న కన్యాశుల్కం, వేశ్యావృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తువు..

1892 లో నాటకపు తొలి ప్రదర్శన జరిగింది. 1892 లో ప్రచురించిన మొదటి కూర్పుకు --- సమాజ, సాహితీపరుల ఆమోదపు ప్రోత్సాహంతోనూ కన్యా శుల్కం నాటకాన్నితిరగ రాసి  ఎన్నో మార్పులు చేసి 1909 లో రెండవ కూర్పును ప్రచురించాడు. వాడుక భాషలో, విజయనగర ప్రాంత యాసలో రాసిన ఈ నాటకం 100 సంవత్సరాల తరువాత కూడా ఈ నాటికీ పాఠకులను అలరిస్తూ ఉంది. ఈ నాటకం కన్నడం, ఫ్రెంచి, రష్యన్‌, ఇంగ్లీషు (2 సార్లు), తమిళం, హిందీ (2 సార్లు) భాషల్లోకి అనువాదమైంది 
 
ఇతర రచనలు
సారంగధర (ఇంగ్లీషు పద్య కావ్యం-ఇండియన్ లీజర్ అవర్ (విజయనగరం) లోనూ రీస్ అండ్ రయ్యత్ (బెంగాల్) పత్రిక లోనూ ప్రచురించబడింది)పూర్ణమ్మ,  కొండుభట్టీయం,     నీలగిరి పాటలు ,ముత్యాల సరాలు,     కన్యక,     సత్యవ్రతి శతకము,     బిల్హణీయం (అసంపూర్ణం),     సుభద్ర,     లంగరెత్తుము,     దించులంగరు,     లవణరాజు కల,     కాసులు, సౌదామిని,   కథానికలు,       దిద్దుబాటు,     మెటిల్డా,   సంస్కర్త హృదయం,  మతము-విమతము.
ఆయన రచనలు రాశిలో తక్కువైనా, వాసికెక్కిన రచనలాయనవి. 

1884 లో మహారాజ కాలేజి వారి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. 1885 లో అప్పలనరసమ్మ గారితో వివాహమైంది. ఆయనకు ముగ్గురు సంతానం - ఇద్దరు కుమార్తెలూ, ఒక కుమారుడు.  1886 లో డిప్యూటీ కలెక్టరు ఆఫీసులో హెడ్‌ క్లర్కు పదవినీ, 1887 లో కళాశాల లో అధ్యాపక పదవిని నిర్వహించాడు. 1886 లో రాజా వారి ఆస్థానంలో చేరాడు. 1911 లో మద్రాసు యూనివర్సిటీ లోని బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ లో సభ్యత్వం లభించింది.

 గురజాడ శాసన పరిష్కర్త, సాహితీవేత్త, భాషా శాస్త్రవేత్త కూడా. గిడుగు రామ్మూర్తిగారితో (విజయనగరంలో చదువుతున్నపుడు నుండి మంచి స్నేహితులు) కలిసి పలు ప్రాంతాలలో చర్చలలో పాల్గొనడం, గ్రాంథిక భాష వాడుక లోపాల్ని చెప్పడంతో బాటు, వ్యవహారిక భాషలో రచనలు చేయడం వల్ల లాభాల్ని వివరిస్తూ, అంతటితో వూరుకోకుండా విశ్వవిద్యాలయాల్లో బోధనా భాషగా వ్యవహారిక భాష ఉండాలని ఉద్యమరీతిలో కృషి చేశారు. 
 
ఆరోగ్యం బాగోకపోయినా (53 సంవత్సరాల వయసులో 1915 నవంబర్ 30 న గరజాడ అప్పారావు మరణించాడు) 52సంవత్సరాల లోపలే ఇన్ని కార్యక్రమాల్ని నిర్వహించారు. సంకల్పబలం ఉంటే తీరిక లేకపోయినా, ఆరోగ్యం బాగుండకపోయినా గొప్ప గొప్ప పనుల్ని ఒంటరిగా, అవలీలగా నిర్వహించవచ్చని నిరూపించారు గురజాడ వేంకట అప్పారావు.

No comments:

Post a Comment